BC ల హక్కులు సాధించే వరకు నా పోరాటం ఆగదు





బీసీ హక్కుల సాధనే లక్ష్యంగా భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ చేస్తున్న నిరాహార ధీక్ష రెండో రోజుకు చేరింది. బీసీలను రాజ్యాధికారానికి చేరువ చేసేలా చేపట్టిన ఈ ధీక్ష రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ధీక్షకు ఇప్పటికే పలు బీసీ సంఘాలతోపాటు స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
తొలిరోజున బీసీ మండల్ మనుమడు సూరజ్ మండల్, మహాత్మా జ్యోతిరావు పూలే ముని మనుమరాలు నీతతాయి రమాకాంత్ పూలే తదితరులు హాజరై బీసీ ధర్మ దీక్షకు మద్దతు పలికారు. బీసీలకు సమన్యాయం దక్కే విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని, ఇప్పటికైనా బీసీలు ఏకతాటిపైకి వచ్చి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తామంతా మద్దతు ఉంటామని ప్రకటించారు.
బోడె రామచంద్రయాదవ్ చేస్తున్న ఐదు డిమాండ్లు సహేతుకమైనవి కావడంతో దేశ వ్యాప్తంగా మద్దతు పెరిగింది. తొలిరోజునే రామచంద్రయాదవ్ చేపడుతున్న ధీక్ష ట్విట్టర్ (ఎక్స్)లో ట్రెండింగ్ లోకి వచ్చింది. తాజాగా వివిధ పార్టీలకు చెందిన నేతలు సంఘీబావం ప్రకటించడంతోపాటు వైసీపీ మాజీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
https://x.com/i/status/2043212140027498720
ఈ సందర్బంగా బోడె రామచంద్రయాదవ్ మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్దమని, బీసీ హక్కుల కోసమే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టానని చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా తగ్గేది లేదని, ఐదు డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని అన్నారు. తాము ఆచరణ సాధ్యమైన డిమాండ్లనే చేస్తున్నామని, అంతేకాకుండా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే గుర్తుచేస్తున్నామని వ్యాఖ్యానించారు. కుట్రలు చేసి తమ ధీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
బీసీల రక్షణకు చట్టం తేవడం, అమరావతిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయింపు, సమగ్ర కులగణన, బీసీలకు విద్య-ఉద్యోగాల్లో, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం వంటి డిమాండ్లను అమలు చేస్తేనే బీసీల అభ్యున్నతి సాధ్యమని వ్యాఖ్యానించారు.
ఈ ధీక్ష తన వ్యక్తిగతమో, తన పార్టీకో సంబంధించిందో కాదని, బీసీల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ధర్మయుద్ధమని స్పష్టం చేశారు. గత ఫిబ్రవరి 28న బీసీ సింహగర్జనలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ డిమాండ్ల గురించి స్పష్టంగా చెప్పామని, ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతోనే ఆమరణ నిరాహార ధీక్షకు దిగానని చెప్పారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీల్లో వైసీపీ కూడా ఉందని, ఐదేళ్లు అధికారంలో ఉన్నా బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు.
ఆయా పార్టీలు చేస్తున్నట్లుగా తాము ఇసుక, ఖనిజ సంపదలో మేము వాటా అడగడం లేదని, రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్న వేలాది ఎకరాలలో వాటా అడగడం లేదని, బీసీలకు న్యాయపరమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్లను నెరవేర్చమని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని వ్యాఖ్యానించారు.
ధర్మ దీక్షకు సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నేతలు పాశం వెంకటేశ్వర్లు, టి కళ్యాణ్ కుమార్, షేక్ నజీర్ భాషా, ఆర్జేడీ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాము, బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తూమాటి కృష్ణమాచారి, మున్నూరు కాపు తెలంగాణా అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్, తెలంగాణా రాష్ట్ర రజకసంఘం అధ్యక్షులు చాపర్తి కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీమివాసరావు, బిసి ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ వి రావు తో పాటు పద్మశాలి రాజ్యాధికార పార్టీ, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, ఆర్య కటక సంఘం, వడ్డెర రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ ప్రతినిధులు, తదితరులు మద్దతు పలికారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
