‘నాన్నా మళ్లీ రావా..!’ – మూవీ రివ్యూ

ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న పాత్ర ఎంతో విలువైనది. తన పిల్లల కోసం నాన్న చేసే త్యాగాన్ని తెరపై చూపించిన చిత్రం ‘నాన్నా మళ్లీ రావా..!’. కమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్దేష్ దర్శకత్వంలో, డా. ఉమారావు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యప్రకాష్ ముఖ్య పాత్ర పోషించారు. ప్రభావతి, రిత్విక్, హరీక, శిరీష కీలక పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
కథాంశం:
వెదురుగూడెం అనే గ్రామానికి చెందిన వెంకన్న (సత్య ప్రకాష్), లక్ష్మి (ప్రభావతి) దంపతులు 30 ఏళ్ల పాటు సంతానం కోసం ఎదురుచూస్తారు. ఎట్టకేలకు లక్ష్మి గర్భం దాల్చడంతో వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే, ఊరిలోని ఎమ్మెల్యేతో గొడవల కారణంగా వెంకన్న, లక్ష్మి తమ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. నగరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ కుమారుడు కేశవ్ (రిత్విక్)ను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. తొలుత చదువుపై శ్రద్ధ చూపని కేశవ్, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకుంటాడు. కేశవ్‌కు అమెరికాలో మంచి జీతం వచ్చే ఉద్యోగం లభిస్తుంది. కానీ, ప్రేమలో వైఫల్యం, తన తండ్రి పడిన కష్టాల తాలూకు బాధ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఇదే సమయంలో తండ్రి ఎలాంటి త్యాగం చేస్తాడు? కొడుకు ఎందుకు తట్టుకోలేని బాధకు గురవుతాడో తెలుసుకోవాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సీనియర్ నటుడు సత్యప్రకాష్. విలన్ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, ఈ చిత్రంలో తండ్రి పాత్రలో జీవించేశారు. ఆయన నటన, హావభావాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. కొడుకు కేశవ్ పాత్రలో రిత్విక్ చక్కగా నటించాడు. ప్రేమ సన్నివేశాల్లో అతడి నటన యువతను ఆకట్టుకుంటుంది. తండ్రి విలువ తెలిసిన తర్వాత కొడుకు అనుభవించే వేదనను రిత్విక్ అద్భుతంగా పలికించాడు. తల్లి లక్ష్మి పాత్రలో ప్రభావతి అద్భుతమైన నటనను కనబరిచారు. భర్తకు, కొడుకుకు మధ్య సమతూకం పాటిస్తూ కుటుంబాన్ని నడిపే తీరును ఆమె సహజంగా చూపించారు. మిగిలిన పాత్రల్లో హరీక, శిరీష, స్వాతి, హరీక, జీఎంఆర్ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాకు సంగీతం హైలైట్ గా చెప్పుకోవచ్చు. గోపీనాథ్ కొండ, అర్మాన్ మెరుగు అందించిన పాటలు హృద్యంగా ఉన్నాయి. “ఆకాశం రివ్వున కరిగిందా…”, “కష్టం ఎదురైనప్పుడు ఓదార్పై..” వంటి పాటలు హర్ట్ టచ్ చేస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పలు సన్నివేశాలను అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ మాత్రం సినిమాకు మైనస్. కొన్ని సన్నివేశాలు సాగదీతగా కనిపిస్తాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ నిర్మాత డా.ఉమారావు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు అభినందించదగినవి.
విశ్లేషణ:
తండ్రి తన పిల్లల కోసం పడే తపనను దర్శకుడు నిర్దేశ్ ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. తాను రాసుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించడంలో ఆయన విజయం సాధించారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ తమ తండ్రి తమ కోసం పడిన కష్టాలను గుర్తు చేసుకుంటారు. సినిమా చివరలో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు ఆగవు. దుఃఖం ఉప్పొంగుతుంది. నాన్న విలువను తెలియజెప్పే ఈ చిత్రం చూస్తుంటే, ఒకప్పుడు అమ్మ గొప్పతనాన్ని చాటిచెప్పిన ‘మాతృదేవోభవ’ సినిమా గుర్తుకు రావడం సహజం. ఒక భావోద్వేగభరితమైన సినిమా చూడాలనుకునే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్: 3.5 / 5
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
