🎙️ మహేంద్రనాథ్ కూండ్ల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
🧩 మొత్తం ప్రశ్నలు: 22 | 📌 ప్రశ్నలు & జవాబులు
















—
🏁 వ్యక్తిగతంగా
1. సినిమాలపై మీకు ఆసక్తి ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచే సినిమాలు చూడడం ఒక అలవాటుగా మారింది. కథ, కథనాలను విశ్లేచించడం, మేకింగ్ విధానాన్ని గమనించడం నన్ను ఈ రంగం వైపు వచ్చేలా చేసింది.
2. మీరు నిర్మాతగా మారాలని ఎప్పుడు అనిపించింది?
జీవితంలో మనం ఎప్పటికైనా చెయ్యాలనుకున్న పనిని మన ఆఖరి రోజుల్లో అయ్యో అపుడు చెయ్యలేఖపోయాను అని నేను బాధపడకూడదు అని అనుకున్నాక, నా కళని సాకారం చేసుకోడానికి నేను నిర్మాతగా మారాను.
3. పరిశ్రమలోకి రాకముందు మీరు ఏ రంగంలో ఉన్నారు?
ఐటీ రంగంలో ఉండేవాడిని. అమెరికా లో సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారం చేసేవాడిని.
—
🎬 సినిమాలు & ప్రొఫెషనల్ అడుగులు
4. మీ తొలి చిత్రం “శబరి” గురించి చెప్పండి.
‘శబరి’ ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తపన, తనకోసం ఏం చెయ్యటానికైనా సిద్ధపడే ఓ తల్లి కథ. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆ పాత్రకి 100% న్యాయం చేశారు. ఒక సినిమా బడ్జెట్ గాడి తప్పితే ఏం అవుతుందో నాకు తెలియ చెప్పిన సినిమా ఇది.
5. “విరాజి” సినిమా అనుభవం ఎలా ఉంది?
వరుణ్ సందేశ్ గారితో చేసిన ‘విరాజి’ సినిమా ఒక సోషల్ ప్రాబ్లంని తీసుకొని థ్రిల్లర్ ఫార్మర్ లో చెప్పిన విభిన్నమైన కథ. ఒక బడ్జెట్ పరిధిలో చేయాలనుకొని చేసిన సినిమా ఇది.
6. “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” టైటిల్ వెనుక ఉద్దేశం ఏంటి?
ఇది మా హీరో హీరోయిన్ల అసలు పేర్ల లో నుంచి తీసుకొని పెట్టిన పేరు. సినిమా కథకు సంబంధం లేని పేరు. బహుశా ఇలా హీరో హీరోయిన్ల అసలు పేర్లతో పెట్టిన మొదటి సినిమా పేరు మాదే అయ్యుండొచ్చు. సినిమా పేరు కొత్తగా ఉంటే ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించవచ్చు అనే ఆలోచనతో పెట్టిన పేరు. అంతేగానీ ఏ కులాన్ని ఎక్కువ చెయ్యాలని కానీ తక్కువ చెయ్యాలని కానీ పెట్టిన పేరు కాదు.
7. ఈ కథ ఎలా పుట్టింది?
డైరెక్టర్ ఒక సైన్స్ రిలేటెడ్ పాయింట్ ను కమర్షియల్ ఫార్మర్ లో నాకు చెప్పడం జరిగింది. ఇండియా లో నాకు తెలిసి ఇంత వరకు ఈ పాయింట్ ను టచ్ చేస్తూ ఏ సినిమా రాలేదు. అందుకే ఈ సినిమా చెయ్యటానికి సిద్ధపడ్డాను.
8. కొత్త హీరో హీరోయిన్లను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు?
మా హీరో అమర్దీప్ చౌదరి ఇప్పటికే సీరియల్స్ లో యాక్ట్ చేసి ఓ మంచి నటుడిగా బాగా ప్రూవ్ చేసుకున్నారు. అలాగే మా హీరోయిన్ సుప్రీత నాయుడు ఒక షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసింది. ఆది నేను చూడడం జరిగింది. అలా వారిద్దరి నటనని ప్రాతిపదికగా తీసుకుని వారిని తీసుకోవడం జరిగింది.
9. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఆత్మీయ భావన ఎలా వచ్చింది?
ఇండస్ట్రీకి నూతన శక్తి అవసరం. నేను కొత్త నిర్మాతని కనుక నా దగ్గరకి అందరూ కొత్తవాళ్ళే వస్తురానుకుంట. అందుకే నా దగ్గరకి వచ్చిన వారిలో టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తున్నా. అంతేకానీ కొత్తవాళ్లతోనే సినిమాలు చెయ్యాలని ప్లాన్ చేసి చేస్తున్నదేం లేదు.
—
🏆 గౌరవాలు & గుర్తింపు
10. “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం పొందడం ఎలా జరిగింది?
ఐటీ మరియు సినిమా రంగంలో నా ప్రాతినిధ్యానికి గుర్తింపుగా ఈ అవార్డు రావడం జరిగింది. నిజాయితీగా కష్టపడితే గుర్తింపు ఏ రంగంలోనైనా దక్కుతుంది అనటానికి ఈ అవార్డ్ ఓ ఉదాహరణ.
11. “దాసరి ఫిల్మ్ అవార్డ్” మీకు ఎలాంటి అనుభూతిని కలిగించింది?
దాసరి గారు లాంటి గొప్ప వ్యక్తి పేరున అందే అవార్డు చాలా ప్రత్యేకం. ఇది నా ప్రయాణాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి అంకితం.
—
💡 ఇండస్ట్రీ అనుభవాలు
12. నిర్మాతగా మీకెదురైన అతిపెద్ద సవాలు?
అనుకున్న బడ్జెట్ లో సినిమాను నిర్మించడం నేను ఎదుర్కున్న, ఎదుర్కుంటున్న పెద్ద సవాలు. ఆ విషయంలో ఇంకా పూర్తిగా సక్సెస్ అయ్యాననుకోవట్లేదు. కథను సినిమాగా నిర్మించడం కాదు… దాన్ని మంచి రిజల్ట్ ఇచ్చేలా మలచడం అతి పెద్ద సవాల్. నటీనటుల ప్లానింగ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, రిలీజ్ డేట్ – అన్నీ సవాళ్లే ఇక్కడ..
13. కుటుంబం నుంచి మద్దతు ఎలా ఉంది?
నిజాయితీగా చెప్పాలంటే ఇంట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. సినిమాలు వద్దన్నారు. అయినా నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి నన్ను ఆపలేదు కూడా. నేను ఏదన్నా అనుకుంటే చేసే మనిషిని కాబట్టి నా నిర్ణయానికే వదిలేశారు..
14. మీ సినిమాల రిలీజ్‌కి ముందు రిజల్ట్ గురించి ఏమన్నా ఆందోళనకి లోనయ్యే వాళ్ళా?
నా సినిమాల రిజల్ట్ నాకు రష్ చూసినప్పుడే అర్ధం అయ్యేవి. ఇది ఆడుతుందా లేదా అని. అందువల్ల నేను ఎప్పుడూ రిజల్ట్ ఏమవుతుందా అని ఆందోళన చెందే వాడిని కాదు. ఒక నిర్మాతగా సినిమాని ప్రేక్షకుడికి దెగ్గరకు ఎలా తీసుకెళ్లాలి అనే దాని గురించే ఆలోచించే వాడిని.
—
💓 మనసుకు దగ్గరైన చిత్రాలు
15. మీ హృదయానికి దగ్గరైన సినిమా ఏది?
కమలహాసన్ గారు నటించిన ‘నాయకుడు’. ఎన్ని సార్లు చూసానో లెక్కే లేదు. ఒక గొప్ప కథ, ఒక గొప్ప దర్శకుడు, ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కలిస్తే ఎలాంటి చిత్రం అవుతుందో చూపించిన చిత్రం అది.
16. మర్చిపోలేని సంఘటన ఏదైనా?
సినిమాలలో ఓనమాలు దిద్దని నేను నిర్మాతగా నా మొదటి సినిమా ‘శబరి’ని ఐదు దేశాలలో, మూడు భాషలలో, షుమారు 300 థియేటర్స్ లో సొంతంగా రిలీజ్ చేసిన సందర్భం ఎప్పటికీ ఆది ఒక సంఘటనలా నాకు గుర్తుండిపోతుంది.
—
🌠 ప్రేరణలు & కలలు
17. సినిమాల పరంగా మీకు స్పూర్తిగా నిలిచిన వ్యక్తులు?
దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. కోడి రామకృష్ణ గారు. ఈ తరం లో అనిల్ రావిపూడి గారు. వాళ్ళు మంచి సినిమాలు తీయటం తో పాటు నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెట్టారు.
18. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?
ఒక మంచి successful కుటుంబ కథా చిత్రమ్ చెయ్యాలని ఉంది. చూడాలి అది ఎప్పటికీ కుదుర్తుందో.
19. నిర్మాత కాకపోతే ఏ వృత్తిని ఎంచుకునేవారు?
ఐటీ రంగంలోనే కొనసాగేవాడిని. కానీ మనసు ఎప్పటికీ సినీ ప్రపంచానిదే.
—
💬 వ్యక్తిత్వం & రిలాక్స్
20. మీరు రిలాక్స్ అయ్యే జోన్ ఏంటి?
సినిమాలు మరియు క్రికెట్ చూడడం నాకు రిలాక్సేషన్. అలాగే పిల్లలతో టైమ్ స్పెండ్ చెయ్యడం నా స్ట్రెస్ బస్టర్.
21. ఫ్రెండ్స్‌లో మీరు ఎలా ఉంటారు?
బహిరంగంగా సీరియస్‌గా కనిపించవచ్చు కానీ ఫ్రెండ్స్ తో లోపల చాలా ఫన్నీ, సింపుల్.
—
📣 ప్రత్యేక ప్రశ్న
22. శబరి మ్యూజిక్ అనే ప్రత్యేక ఆడియో లేబుల్ కంపెనీ పెట్టడానికి కారణం ఏమిటి?
చిన్న సినిమాల ఆడియో రైట్స్ విషయయం లో ఓ రకమైన వివక్షను చూసాను. అది నచ్చలేదు.అందుకే శబరి మ్యూజిక్ అనే ఆడియో లేబుల్ కంపెనీ స్టార్ట్ చేశాను.ఇది కేవలం చిన్న సినిమాల కోసమే స్టార్ట్ చేశాను.లాభాపేక్షతో కాదు.ఇందులో చిన్న సినిమా నిర్మాతలు రెవెన్యూ షేరింగ్ మోడల్ లో వాళ్ళ సినిమా ఆడియోను పెట్టుకోవచ్చు.90% రెవెన్యూని నిర్మాతలకే ఇచ్చే పద్ధతిలో ప్లాన్ చేసాం.మిగతా 10% కూడా సర్వర్ మెయింటెన్స్ కోసం ఉంచుకుంటున్నాం..
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
