ప్రతిభకు పట్టాభిషేకం..
ఘనంగా జరిగిన ‘బుస్సా ఫిల్మీ ఫోకస్ విజేత అవార్డుల ప్రదానోత్సవం`



హైదరాబాద్ (ఫిల్మ్ నగర్):
వెండితెర , మరియు వివిదరంగాలలో అలుపెరగని కృషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవించుకోవడం బాధ్యతగా స్వీకరించడం గొప్పవిషయం అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ప్రముఖ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బుస్సా బాలరాజు సారథ్యంలో ‘బుస్సా ఫిల్మీ ఫోకస్’ ఈ-పేపర్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్.వి. ప్రసాద్ ల్యాబ్లో ‘విజేత అవార్డ్స్ – 2026’ వేడుకను ఘనంగా నిర్వహించారు.
అతిరథ మహారథుల సమక్షంలో..
అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి శ్రీ వేణుగోపాలాచారి, విశిష్ట అతిథులుగా ప్రముఖ నటులు శ్రీ బాబు మోహన్, శ్రీ కాదంబరి కిరణ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ సి. పార్థసారథి, ప్రముఖ దర్శకులు శ్రీ ఎన్. శంకర్, శ్రీ బాబ్జీ, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్, నిర్మాత, నటులు లైన్ సాయి వెంకట్, నిర్మాత డాక్టర్ వేదాల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త శ్రీమతి చకిలం స్వప్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభినందనల జల్లు
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవంతో, బాలరాజు గారు ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ అవార్డులను నెలకొల్పడం అభినందనీయమన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి సత్కరించడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం వివిధ విభాగాల్లో విజేతలకు అవార్డులను అందజేసి అభినందనలు తెలిపారు.
సందడిగా సాంస్కృతిక ప్రదర్శనలు
కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. పొదిలి వెంకటేష్ (కడప), మాధురి తమ గీతాలాపనతో సభికులను మైమరిపించారు. ఈ వేడుకకు యాంకర్ నేహా మౌనిక తన వాక్చాతుర్యంతో నిండుదనాన్ని తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత గుర్రపు విజయ్ కుమార్, దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి, వంశీ టీవీ MD వంశీకృష్ణ, ప్రొడక్షన్ విభాగం నుండి మధు, రామకృష్ణ ,వినోద్ బృందం పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు. ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ బుస్సా బాలరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
